యువతకు ఉపాధి, సాంస్కృతిక, చారిత్రక, వారసత్వ పారంపర్య కొనసాగింపే పర్యాటక రంగాభివృద్ధి ప్రధాన లక్ష్యం : ప్రత్తిపాటి
• ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక టూరిజం పాలసీ పర్యాటకాభివృద్ధికి దోహదపడుతుంది
• ప్రభుత్వం ఆకర్షించిన పెట్టుబడుల్లో 28వేల కోట్లు పర్యాటకరంగం పరిధిలోనివే
• ఈ పెట్టుబడులతో 1,22,000లకు పైగా ఉద్యోగావకాశాలు లభిస్తాయి
• ప్రభుత్వం పర్యాటక రంగానికి నిధులు పెంచి, కొండవీడు వంటి ప్రదేశాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
• కొండవీడు కోటకున్న చారిత్రక, సాంస్కృతిక ప్రాశస్త్యం, పర్యాటక అనుకూలతలు మరే ప్రదేశానికి లేవు
• కొండవీడును ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్న ముఖ్యమంత్రి హామీ నెరవేర్చాల్సిన సమయం వచ్చింది
• కళలకు పుట్టిల్లు అయిన చిలకలూరిపేటలో గతంలో నిర్మించాలనుకున్న ఆడిటోరియం నిర్మాణాన్ని ప్రభుత్వం వెంటనే పూర్తిచేయాలి.
రాష్ట్ర పర్యాటక రంగాన్ని 2027 నాటికి దేశంలోనే నంబర్ 1 స్థానంలో నిలపాలన్న గొప్ప ఆలోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారని, దానిలో భాగంగానే కూటమిప్రభుత్వం పర్యాటక రంగాభివృద్ధికి ప్రత్యేక టూరిజం పాలసీ ప్రకటించిందని మాజీమంత్రి, శాసనసభ్యు లు ప్ర్తతిపాటి పుల్లారావు పేర్కొన్నారు.
బుధవారం శాసనసభలో బడ్జెట్లో పర్యాటక రంగానికి కేటాయించిన నిధులు - భవిష్యత్ లక్ష్యాలు అన్న అంశంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ప్రత్తిపాటి మాట్లాడారు.
*రాష్ట్ర పర్యాటక రంగాభివృద్ధికి సమగ్ర టూరిజం పాలసీ*
రాష్ట్రాభివృద్ధిలో పర్యాటకానిది కీలక పాత్ర అని, పర్యాటకం అంటే కేవలం టూరిస్టులను ఆకర్షించడమే కాదని, స్థానిక యువతకు ఉపాధి, సాంస్కృతిక, చారిత్రక, వారసత్వ వైభవ పారంపర్య కొనసాగింపనే ప్రధాన ఆశయం ఇందులో ఇమిడి ఉందని ప్రత్తిపాటి పేర్కొన్నారు. రాష్ట్ర సాంస్కృతిక, చారిత్రక విశిష్టతను ప్రపంచానికి పరిచయం చేయాలన్న గొప్ప లక్ష్యంకూడా ఇందులో ఉందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర పర్యాటక బ్రాండ్ బలోపేతంలో గానీ, సమగ్ర నూతన టూరిజం పాలసీ ప్రకటన, యువతకు విస్తృత ఉపాధి అవకాశాల సృష్టిలో గానీ ప్రభుత్వం ఇప్పటికే తొలి అడుగు వేసిందన్నారు. దేశంలో ఎక్కడా లేని కూటమి ప్రభుత్వం పర్యాటకాభృద్ధికి సమగ్ర టూరిజం పాలసీ తీసుకొచ్చిందని ప్రత్తిపాటి చెప్పారు. ప్రభుత్వం ఆకర్షించిన పెట్టుబడుల్లో 28వేలకోట్లు టూరిజం శాఖ పరిధిలోనివేనని, వాటివల్ల 1,22,000లకు పైగా ఉద్యోగావకాశాలు రాష్ట్రయువతకు లభిస్తాయని ఆయన తెలిపారు.
*పర్యాటక రంగానికి ప్రభుత్వం నిధులు పెంచాలి ..*
పర్యాటక రంగానికి ప్రభుత్వం నిధుల కేటాయింపు పెంచాలని, రూ.439 కోట్ల కేటాయింపులు సరిపోవని ప్రత్తిపాటి అభిప్రాయపడ్డారు. అలానే ప్రభుత్వ నిర్వహణలోని వివిధ ఉత్సవాలకు 186.27 కోట్లు కేటాయించాలని, ఈ నిధులుకూడా పెంచాలన్నారు.
కూటమిప్రభుత్వం వచ్చాకే రాష్ట్రంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి ట్రేడ్ ఫెయిర్లు, వివిధ రకాల ఉత్సవాలు, ప్రభుత్వ పండుగలు, తిరునాళ్ల నిర్వహణ గతంలో ఎన్నడూ లేనివిధంగా వైభవంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో వీటి నిర్వహణకు నిధులు కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు.
*కొండవీడు వంటి చారిత్రక ప్రదేశం మరోటి లేదు* *కొండవీడు అభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకరించని పక్షంలో రాష్ట్రప్రభుత్వమే ప్రత్యేక నిధులు కేటాయించాలి*
2019 ఫిబ్రవరిలో అప్పటి, ఇప్పటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తొలిసారి కొండవీడు ఉత్సవాలు ప్రారంభించారని, అప్పుడు కొండవీడు కోట ఘాట్ రోడ్డుకు అనుసంధానిస్తూ, చౌడవరం నుంచి టన్నెల్ నిర్మించి 5 కి.మీ రోడ్డువేస్తామని చెప్పారని ప్రత్తిపాటి పేర్కొన్నారు. అదే సమయంలో కొండవీడును ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు ప్రకటించారన్నారు. సీఆర్డీఏ పరిధిలో కొండవీడును మించిన గొప్ప పర్యాటక, చారిత్రక ప్రదేశం మరోటి లేదన్న ప్రత్తిపాటి. ఆ ప్రాంత అభివృద్ధికి తాజా బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. కొండవీడు అభివృద్ధికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.110కోట్ల డీపీ ఆర్ ను కేంద్రానికి పంపినట్టు పర్యాటక శాఖ మంత్రి తెలియచేశారన్నారు. కేంద్రం పూర్తిగా సహకరిస్తే ఇబ్బందిలేదని, లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం కొండవీడు అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించాలని ప్రత్తిపాటి కోరారు. చిలకలూరిపేటలో గతంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఆడిటోరియం నిర్మాణాన్ని ప్రారంభించారని, అది నేటికీ పూర్తికాలేదని ప్రత్తిపాటి చెప్పారు. కళలకు పుట్టిల్లు అయిన చిలకలూరిపేటలో నిర్మించాలనుకున్న ఆడిటోరియాన్ని ప్రభుత్వం టూరిజం శాఖ పరిధిలోకి చేర్చి తక్షణమే పూర్తయ్యేలా చూడాలని ప్రత్తిపాటి విజ్ఞప్తిచేశారు. కూటమిప్రభుత్వ సంక్షేమపథకాలతో పాటు, ప్రధానంగా స్త్రీశక్తి పథకం వల్ల ప్రభుత్వం నిర్వహించే ఉత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, తిరునాళ్లకు మహిళల తాకిడి బాగా పెరిగిందని ప్రత్తిపాటి చెప్పారు. ఈ నేపథ్యంలో పర్యాటక ప్రదేశాల్లో మహిళలకు ప్రత్యేక వసతులు, భద్రతాంశాలపై ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి