నాడు ఏకగ్రీవం.. నేడు గైర్హాజరు: రాజధాని విషయంలో వైసీపీ ద్వంద్వ నీతి.!.. మల్లెల శివ నాగేశ్వరావు
అబద్ధం చెప్పటం ఒక కళ అనేది పాత నానుడి అయితే, అబద్ధం చెప్పటానికి ధైర్యం ఉంటే చాలు అనేది వైసీపీ చెబుతున్న కొత్త పాఠం. "తెలుగుదేశం పార్టీ అనేది నాయకులను తయారుచేసే కర్మాగారం" అని రేవంత్ రెడ్డి ఎప్పుడూ అంటుంటాడు, అది వాస్తవం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అని రెండు తెలుగురాష్ట్రాలను చూస్తే అర్థమవుతుంది. అయితే దీనికి భిన్నంగా, టీడీపీ అంత అనుభవం లేని పార్టీ అయినప్పటికీ, వైసీపీ కూడా రాజకీయాలలో ఎలా ఉండకూడదో నేర్పిస్తూ తనదైన పాత్ర పోషిస్తున్నది. ఈరోజు విభజిత ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఒక అద్భుతమైన ఘట్టం ఆవిష్కరించటానికి వేదికగా మారిన శాసనసభకు వైసీపీ గైర్హాజరు అయింది. శాసనసభకు రాకపోవటం జగన్మోహన్ రెడ్డికి కొత్త కాకపోవచ్చు. రాజధాని అనేది రాష్ట్రానికి గుండెకాయ లాంటిది. నియంతలు ఎవరూ జోక్యం చేసుకోకపోతే రాష్ట్రానికి అది శాశ్వత చిరునామా. అభ్యంతరాలు ఉండవచ్చు, కానీ ఎక్కడో ఒక దగ్గర ఒక నిర్ణయానికి రాక తప్పదు. అమరావతిని ప్రతిపాదించినప్పుడు శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఆనాటికి ఒక రాజకీయపార్టీగా ప్రభావశీలంగా లేని సమయంలో, ఎన్నికలలో టీడీపీకి మద్దతు తెలిపిన పవన్ కళ్యాణ్ కూడా "కొంతమంది రైతులు భూములు ఇవ్వనంటున్నారు, వారిని బలవంత పెట్టకూడదు" అంటూ అభ్యంతరాలు తెలిపాడు, పోరాటం చేసే ప్రయత్నం కూడా చేశాడు. కానీ ప్రాథమికంగా వైసీపీ నుండి ఎటువంటి అభ్యంతరాలు రాలేదు. ఆనాడు వైసీపీ సాధారణ ప్రతిపక్షంగా లేదు, మూడవ వంతు పైబడిన శాసనసభ్యులతో బలమైన ప్రతిపక్షంగా ఉన్నది. ఆరోజు తన అభ్యంతరాన్ని బలంగా వినిపించి ఉంటే ప్రభుత్వానికి కొద్దిగా ఇబ్బందిగానే ఉండేది. కానీ వైసీపీ ఆరోజు ఆమోదం తెలిపింది. ఆ మాటలు నమ్మిన అమరావతి ప్రాంత ప్రజలు చంద్రబాబును కాదని వైసీపీకి జై కొట్టారు. తనను అంతగా ఓడించటానికి కారణం ఏమిటో తెలుసుకోవటం చంద్రబాబు నాయుడు తరం కూడా కాలేదు. అయినా ప్రజలపైన విశ్వాసంతో చంద్రబాబు, టీడీపీ పార్టీ కార్యకర్తలు మొక్కవోని దీక్షతో పని చేసుకుంటూనే పోయారు. ఐదు సంవత్సరాలు తిరిగేటప్పటికే ప్రజలు జగన్మోహన్ రెడ్డి పాలనలోని లోపాలు భరించలేకపోయారు, కూటమికి ఓటేశారు. ఇక్కడే వైసీపీని చూసి రాజకీయపార్టీలు ఎలా ఉండకూడదో ఒక పాఠం నేర్చుకునే పరిస్థితి వచ్చింది. ఒక గెలుపు రాగానే తనకు తిరుగులేదు అని భావిస్తే ఇటువంటి ఫలితాలే వస్తాయి అని బయటపడింది. అటువంటి పాఠాలు నేర్చుకోవటంలో పవన్ కళ్యాణ్ ముందున్నాడనే చెప్పాలి. గెలిచిన వారికి ఎంత బాధ్యత ఉంటుందో చంద్రబాబును చూసి నేర్చుకుంటూనే, "వంద శాతం స్ట్రైక్ రేట్‌తో గెలిచామని విర్రవీగకూడదు" అనే సత్యాన్ని వైసీపీ నుండి నేర్చుకుంటున్నాడు. నేర్చుకోవటం అనేది వెనుకబాటుతనానికి చిహ్నం కాదని, అది ఒక గొప్ప కళ అని పవన్ గ్రహించాడు. కానీ పవన్ కంటే అద్భుతమైన అవకాశాలను ముందే అందుకున్న జగన్మోహన్ రెడ్డి మాత్రం గ్రహించలేకపోతున్నాడు. తనకంటే వెనుక రాజకీయరంగ ప్రవేశం చేసిన పవన్ కళ్యాణే కాదు, అంతకంటే వెనుక వచ్చిన లోకేష్ కూడా "పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి" అనే సూత్రాన్ని పాటించాలనుకున్న వారు ఎలాంటి కార్యాచరణను రూపొందించుకోవాలో నేర్పే మార్గదర్శకుడు అయ్యాడు. గెలుపును ఆస్వాదించటం కంటే నిలుపుకోవటం కోసం వారిద్దరూ పడుతున్న తాపత్రయం, అందుకు వారిద్దరి కృషి అభినందనలు అందుకుంటున్నది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆచరిస్తున్న పద్ధతులు ఆయనను గెలుపు తీరాలకు చేర్చేలా కనిపించటం లేదు. కూటమిప్రభుత్వం స్వయంగా ఓటమిని తాము కొని తెచ్చుకుంటే తప్ప, జగన్మోహన్ రెడ్డి తన గెలుపు కోసం చేస్తున్న ప్రయత్నాలు కనిపించటం లేదు. రాజధాని విషయంలో తాను అనుకున్నది తప్పు అని ఉత్తరాంధ్ర, రాయలసీమతో సహా అన్ని ప్రాంతాల ప్రజలు నిరూపించారు. ఇప్పుడు అమరావతికి చట్టబద్ధత వస్తున్న ఈ సందర్భాన్ని బేషరతుగా ఒప్పుకుంటే పోయేదేమీ లేదు. రాష్ట్ర రాజధాని విషయంలో స్పష్టమైన అభిప్రాయం చెప్పవలసి వస్తుందని బెంగళూరుకు వెళ్ళిపోతే ప్రజల విశ్వాసం చూరగొనటం అసాధ్యం. ఇప్పటికీ అమరావతి పట్ల అభ్యంతరం ఉంటే, అభ్యంతరాలకు కారణాలు తెలుపుతూ "ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తున్నాను" అనే మర్యాదను తెలిపినా గౌరవంగా ఉండేది. నిన్నటి రోజున శాసనసభకు వెళితే గౌరవం మరింత ఇనుమడించేది. ప్రతిపక్ష నాయకుడి హోదా కోసం భీష్మించుకుని ఉండి కూడా, రాజధాని విషయం ప్రాధాన్యత రీత్యా తన పట్టుదలను సడలించుకుని జగన్ శాసనసభకు వచ్చాడని వైసీపీ కార్యకర్తలు చెప్పుకునే అవకాశం ఉండేది.వచ్చిన ప్రతి అవకాశాన్ని జారవిడుచుకొని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో రోజురోజుకూ తన ప్రాధాన్యతను కోల్పోతున్నాడు జగన్. ఇప్పటికిప్పుడు కూటమి చీలిపోతే రాష్ట్రంలో పోటీ టీడీపీ, జనసేన మధ్యే ఉంటుంది అని ప్రజలు చెప్పుకుంటున్నారు. ఒకనాడు కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేసి ఎనిమిది శాతం ఓట్లు మాత్రమే సాధించగలిగిన పవన్ కళ్యాణ్ నిదానంగా ఒక్కో మెట్టు ఎక్కుతుంటే, జగన్ దిగిపోతున్నాడు. "తాను అమరావతిని తొక్కేయాలనుకుంటే అమరావతే తనను తొక్కేసింది" అనే ప్రతీకార భావనతో ఇప్పటికీ రగిలిపోవటం జగన్ రాజకీయ జీవితంలో చేసిన ఆఖరి తప్పుగా మిగిలిపోకూడదు అని బొత్స లాంటి వారు సలహా ఇచ్చే ఉంటారు, పెడచెవిన పెడితే ఎవరు చేయగలిగింది ఏమీ లేదు. రాబోయే తరాలకు ఇదొక పాఠం.
ఇక చంద్రబాబు నాయుడుని విమర్శించటం కాక తిడితేనే పార్టీ గెలుస్తుంది అనే భ్రమ నుండి బయటకు రాలేని బలహీనత వైసీపీకి ఏ మాత్రం బలాన్ని ఇవ్వదు. అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు అదే ప్రయత్నం చేసి పార్టీ ఎంత నష్టపోయినా ఇప్పటికీ అదే వరుస. ఆయనను తిట్టినా, పొగిడినా భారత రాజకీయాలలో ఆయన స్థానాన్ని జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ ఆక్రమించలేడు. రాజ్ నారాయణ ఇందిరాగాంధీని ఒకసారి ఓడించినంత మాత్రాన ఆయనేమీ సాటిలేని మేటి వీరుడు అయిపోలేదు. అప్పటికీ ఇప్పటికీ ఇందిరాగాంధీని అపరకాళికా దేవి అనే అంటారు, రాజ్ నారాయణ్‌ను రాజకీయ జోకర్ అనే అంటారు. పెద్దవాళ్లను తిడితే పెద్దవాళ్లు అయిపోరు, వారిలోని మంచిని ఆచరిస్తే వారి స్థాయిని చేరుకునే అవకాశం ఉంటుంది.ఒకరిని చూసి ఏం చేయ్యాలో నేర్చుకునేలా ఉండాలి కానీ, ఏం చేయకూడదో నేర్చుకునేలా ఉండకూడదు. ఒక రాష్ట్ర సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతిబింబంగా ఉండే రాజధానికి వ్యతిరేకంగా కార్యాచరణను రూపొందించుకునే ఏ రాజకీయ పార్టీ కూడా మనలేదు. ఒకనాటి తెలంగాణ ఉద్యమానికి బీజం వేసింది తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలయితే, మలిదశ తెలంగాణ ఉద్యమంలో బలమైన పాత్ర పోషించింది హైదరాబాద్ అభివృద్ధి. చండీగఢ్ మాదిరిగా హైదరాబాదును ఉమ్మడి రాజధానిగానే ఉంచుదాం అంటే తెలంగాణ సమాజం ఖచ్చితంగా ఒప్పుకుని ఉండేది కాదు. రాజధానికి అంత ప్రాధాన్యత ఉంటుంది. ఒక బలమైన ప్రాంతీయపార్టీగా ఆ ప్రాంత రాజధాని పట్ల అభిమానం చూపించకపోవటం ద్రోహం అవుతుంది. ప్రస్తుతం వైసీపీ ఆంధ్రప్రదేశ్‌కు చేస్తున్న ద్రోహం అదే. కళ్ళు మూసుకుని కళ్ళు తెరిస్తే ఎన్నికలు దగ్గర పడతాయి. తాను ఒక సంవత్సరం పైనే పాదయాత్ర చేస్తానని అంటున్నాడు. ప్రజల దగ్గరకు వెళ్ళినప్పుడైనా, ఎన్నికలు వచ్చినప్పుడైనా ప్రజలు కళ్లు మూసుకుని ఉండరు, ప్రజలకు సమాధానం చెప్పవలసిందే. అదే ఇప్పుడు శాసనసభలో చెప్పివుంటే బాగుండేది. చెప్పకపోతే ఇవన్నీ రాబోయే తరాలకు రాజకీయాలలో ఏమి చేయకూడదో వైసీపీ చెప్పే పాఠాలు అవుతాయి.!
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి