గురుకుల విద్యలో విప్లవాత్మక సంస్కరణలు
హైదరాబాద్, జూన్ 12: తెలంగాణ గురుకుల విద్యా వ్యవస్థలో ప్రభుత్వం కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. గురుకుల విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్య అందించాలనే లక్ష్యంతో టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
డిగ్రీ కళాశాలల అధ్యాపకులకు యూజీసీ వేతన స్కేలు అమలు దిశగా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. అలాగే గురుకుల డిగ్రీ కళాశాలల నిర్వహణ కోసం ప్రత్యేక పరిపాలనా విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు. విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచేందుకు న్యాక్ (NAAC) గుర్తింపు సాధన కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఎస్సీ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, ఆర్థిక సహాయం
విదేశీ విద్యను అభ్యసించేందుకు వెళ్లే ఎస్సీ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, ఆర్థిక సహాయం అందించే ప్రతిపాదనకు ఆమోదం లభించింది. రాష్ట్రవ్యాప్తంగా మరో 9 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేసి ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్నత స్థాయి శిక్షణ అందించనున్నారు.
వైద్య, ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా 9వ తరగతి నుంచే నీట్, జేఈఈ కోచింగ్ అందించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. ఆధునిక సాంకేతిక అవసరాలకు అనుగుణంగా గురుకుల డిగ్రీ కళాశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కోర్సులను ప్రవేశపెట్టనున్నారు.
ఈ నిర్ణయాలు గురుకుల విద్యార్థుల ఉన్నత విద్యా అవకాశాలను విస్తరించడంతో పాటు, పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు దోహదపడనున్నాయని అధికారులు పేర్కొన్నారు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి