*టీడీఆర్ బాండ్లు వద్దంటే.. భూసేకరణ చట్టప్రకారం పరిహారం ఇవ్వాల్సిందే.*
*బాండ్లు తీసుకోవాలని ఒత్తిడి చేయడానికి వీల్లేదన్న హైకోర్టు*
రహదారుల విస్తరణ, ఇతర అవసరాల కోసం భూములు సేకరించే క్రమంలో ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ బాండ్లు (టీడీఆర్- బదిలీకి వీలున్న హక్కుపత్రాలు) తీసుకోవాలని భూయజమానులను ఒత్తిడి చేయడానికి వీల్లేదని ఏపీ హైకోర్టు స్పష్టంచేసింది. టీడీఆర్ బాండ్లు తీసుకోవడానికి ఆస్తి హక్కుదారులు,భూయజమానులు నిరాకరించినప్పుడు భూసేకరణ చట్టం-2013 ప్రకారం వారికి పరిహారం చెల్లించడమే అధికారుల ముందున్న ఏకైక మార్గమని తేల్చిచెప్పింది. బాండ్లు తీసుకోవడం తప్పనిసరి కాదని, అది ఐచ్ఛికం మాత్రమేనని తెలిపింది. ఒంగోలు ట్రంక్ రోడ్డు విస్తరణ కోసం మున్సిపల్ అధికారులు ప్రతిపాదించిన టీడీఆర్ బాండ్లను తీసుకునేందుకు పిటిషనర్లు నిరాకరించడంతో మార్కెట్ ధరను మదింపు చేసి భూసేకరణ చట్ట నిబంధనలను అనుసరించి పిటిషనర్లకు పరిహారం చెల్లించాలని అధికారులను ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ఇటీవల ఈ మేరకు తీర్పు ఇచ్చారు.
ప్రకాశం జిల్లా ఒంగోలు ట్రంక్ రోడ్డు విస్తరణ కోసం తమ స్థలాలు తీసుకుంటున్నందుకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు టీడీఆర్ బాండ్లు తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారంటూ కె.సుస్మిత్ కుమార్, మరి కొందరు హైకోర్టులో వ్యాజ్యాలు వేశారు. తమకు బాండ్లు వద్దని, భూసేకరణ చట్టప్రకారం పరి హారం ఇప్పించాలని కోరారు. పిటిషనర్ల తరపున షేక్ ఆసిఫ్ వాదనలు వినిపించారు. బాండ్లు తీసుకోవాల్సిందేనని, లేనిపక్షంలో ఇళ్లు కూల్చేస్తామని అధికారులు బెదిరిస్తున్నారన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి. భూయజమానులు టీడీఆర్ బాండ్లను స్వచ్ఛందంగా అంగీకరిస్తే పర్వాలేదు గానీ, వాటిని అంగీకరించడం తప్పనిసరి కాదన్నారు. భూసేకరణ చట్ట నిబంధనలను అనుసరించి పిటిషనర్లకు పరిహారం చెల్లించాలని అధికారులను ఆదేశించారు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి