రాబోయే రోజుల్లో అమరావతిని ఎవరూ టచ్ చేయలేరు
*సీఎం చంద్రబాబు*
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత బిల్లుకు ఈరోజు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఏపీ పునర్విభజన చట్ట సవరణ పేరుతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం సుమారు రెండు గంటలపాటు దీనిపై చర్చ జరిగింది. టీడీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, సమాజ్‌వాదీ సహా పలు పార్టీల ఎంపీలు చర్చలో పాల్గొన్నారు. అనంతరం బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపినట్లు స్పీకర్ స్థానంలో ఉన్న తెన్నేటి కృష్ణప్రసాద్ ప్రకటించారు. ఈ బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు రానుంది.
అమరావతికి చట్టబద్ధత బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టడం ఒక చరిత్ర అని సీఎం చంద్రబాబు అన్నారు. రాబోయే రోజుల్లో అమరావతిని ఎవరూ టచ్ చేయలేరన్నారు. అమరావతిని ఇంచు కూడా కదిలించలేరు. ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతి ఉంటుందని సీఎం పేర్కొన్నారు. నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నెల్లూరు జిల్లా వింజమూరులో పర్యటించారు. లబ్ధిదారులకు ఆయన ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు.
అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. స్వర్ణాంధ్రకు ఆరు సూత్రాలతో ముందుకు వెళ్తున్నామన్నారు. గత 5 ఏళ్లు అరాచక, విధ్వంస పాలన సాగిందని అన్నారు. "నా జీవితంలో ఇలాంటి వ్యక్తిని, పార్టీని చూడలేదు. వైఎస్సార్సీపీది మూడు ముక్కలాట, మూడు రాజధానులు నినాదం, ప్రత్యేక శాసనసభ ఏర్పాటు పెడితే కనీసం అసెంబ్లీకి కూడా రాలేదు. మాది వైఎస్సార్సీపీ అని చెప్పుకునేందుకు ఆ పార్టీ నేతలు సిగ్గు పడాలి" అని సీఎం చంద్రబాబు జగన్‌పై మండిపడ్డారు.
రాజధాని మీద దుష్ప్రచారం చేశారన్నారు. ముంపు ప్రాంతం, శ్మశానం అంటూ హేళన చేశారని సీఎం అన్నారు. దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా పింఛన్లు పెంచి ఇస్తున్నామని పేర్కొన్నారు. నెలకు రూ.2730 కోట్లు ఖర్చు పెడుతున్నామని వెల్లడించారు. ఇప్పటికే రూ.60 వేల కోట్లు పింఛను కింద అందించామని చెప్పారు. స్టూడెంట్స్ స్కూల్‌కి వెళ్లేలోపు తల్లుల అకౌంట్లో డబ్బులు వేస్తున్నామన్నారు. గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. శ్రీశైలం, పోలవరం వాటర్ ఉదయగిరికి కూడా వస్తాయి. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు P4ను తీసుకొచ్చామని, 25 వేల కుటుంబాలను దత్తత తీసుకునేందుకు అదానీ సిద్ధంగా ఉన్నారని సీఎం అన్నారు.
వింజమూరులో ఏర్పాటు చేసిన డీఆర్డీఓ రక్షణ ఉత్పత్తుల స్టాల్‌ను సీఎం పరిశీలించారు. సూక్ష్మ సేద్యం ద్వారా పండించిన పామాయిల్, జొన్న, బొప్పాయి తదితర పంటలకు సంబంధించిన స్టాళ్లను సందర్శించారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి ఎన్ఎండీ ఫరూక్, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, బీద మస్తాన్‌రావు, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేశ్, మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కంభం విజయరామిరెడ్డి, వంటేరు వేణుగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి