- ఉత్తర్వులు విడుదల చేసిన రైల్వే బోర్డు.
- రైల్వే శాఖామంత్రి అశ్విని వైష్ణవ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన రామ్మోహన్ నాయుడు.
- మరింత వేగంగా ఉత్తరాంధ్ర రైల్వేను అభివృద్ధి చేసుకుంటామని ధీమా వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి.
విశాఖ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ లో ఇచ్చాపురం నుండి పలాస మధ్య ప్రాంతాలు విలీనం అయ్యాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాకు, ఉత్తరాంధ్ర ప్రాంతానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చిరస్మరణీయమైన రోజుగా అభివర్ణించిన రామ్మోహన్ నాయుడు.. ఈరోజు జిల్లా ఉన్నతికి సంబంధించి వరుసగా శుభవార్తలు అందుకుంటూ ఉండటం ఆనందంగా ఉందని అన్నారు.
రైల్వే బోర్డు నుండి వచ్చిన తాజా ఉత్తర్వుల ప్రకారం, ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలోని ఖుర్దా రోడ్ డివిజన్‌లో ఇప్పటివరకు ఉన్న ఇచ్చాపురం నుండి పలాస మధ్య రైల్వే ప్రాంతం ఇప్పుడు విశాఖ కేంద్రంగా ఉన్న సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలోకి చేరిందని తెలిపారు. ఈ నిర్ణయం ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కలను మరింత బలపరిచే చారిత్రాత్మక అడుగుగా రామ్మోహన్ నాయుడు చెప్పుకొచ్చారు.
రాష్ట్ర విభజన సమయం నుండి విశాఖ రైల్వే జోన్ కోసం నిరంతరంగా పోరాటం సాగించామని.. పార్లమెంట్‌లో, వివిధ వేదికల్లో ఉత్తరాంధ్ర ఆకాంక్షలను నేను పదేపదే ప్రస్తావించినట్లు గుర్తు చేశారు. ఆ పోరాటాల ఫలితంగానే విశాఖ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఆవిర్భవించినప్పటికీ.. ఆ జోన్ పరిధిలో ఇచ్చాపురం - పలాస మధ్య ప్రాంతం లేకపోవడం తనకు వెలితిగా ఉండేదని రామ్మోహన్ నాయుడు అన్నారు.
ఇదే విషయాన్ని పలు మార్లు కేంద్ర రైల్వే శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్ తో భేటిలో వివరించి, ఖుర్దా రోడ్ డివిజన్‌లోని ఇచ్చాపురం - పలాస మధ్య ప్రాంతాన్ని సౌత్ కోస్ట్ విశాఖ జోన్‌లోకి మార్చాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఈ మార్పు ద్వారా ఆ ప్రాంతంలో రైల్వే వసతుల విస్తరణ, స్టేషన్ల ఆధునికీకరణ, రైళ్ల అదనపు నిలిపివేతలు, సరకు రవాణా సౌకర్యాల అభివృద్ధి వేగంగా సాధ్యమవుతుందని అన్నారు.
ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో అనేక కొత్త హాల్ట్‌లు, అమృత్ భారత్ స్టేషన్లు వంటి పథకాల ద్వారా రైల్వే రంగంలో విప్లవాత్మక మార్పులు సృష్టించగలిగామని, తాజాగా ఇచ్చాపురం నుండి పలాస మధ్య ప్రాంతాన్ని సౌత్ కోస్ట్ జోన్ పరిధిలోకి చేర్చిన రైల్వే బోర్డు నిర్ణయం మరింత ఉత్సాహాన్నీ, అభివృద్ధి పట్ల కొత్త ధైర్యాన్నీ కలిగిస్తోందని రామ్మోహన్ నాయుడు అన్నారు. రానున్న రోజుల్లో ఈ లైన్లో ప్రయాణికుల సౌకర్యాలు, స్టేషన్ సదుపాయాలు, రైల్వే అనుబంధ మౌలిక వసతుల అభివృద్ధి కోసం మరింత దృష్టి సారించేందుకు ఇది బలమైన పునాదిగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాను, ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని రైల్వే మౌలిక వసతుల పరంగా దేశంలో ఆదర్శంగా మార్చే లక్ష్యంతో తన కృషి ఇలాగే కొనసాగుతుందని హామీ ఇచ్చారు.
ఉత్తరాంధ్రలో రైల్వే అభివృద్ధికి ఎల్లప్పుడూ పూర్తి మద్దతు అందిస్తున్న కేంద్ర రైల్వే శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి