దక్షిణ కర్ణాటకలో రాబోయే మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (IMD) ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బెంగళూరు, బెంగళూరు రూరల్, మైసూరు, శివమొగ్గ, తుమకూరు, చిక్కమగళూరు సహా సుమారు 15 జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది.
ఈ వర్షాల ప్రభావంతో కృష్ణా, తుంగభద్ర నదులకు వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అల్మట్టి డ్యాంకు సుమారు 75 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, అక్కడి నుంచి దాదాపు 90 వేల క్యూసెక్కుల నీటిని నారాయణపూర్ జలాశయానికి విడుదల చేస్తున్నారు.
నారాయణపూర్‌లో నిల్వ సామర్థ్యం పరిమితంగా ఉండటంతో, వచ్చిన నీటిని వెంటనే జూరాల ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే జూరాలలో నీటి నిల్వలు పెరుగుతుండగా, మరిన్ని వరద జలాలు చేరే అవకాశం ఉంది. దీంతో జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా నీటి విడుదల ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ సీజన్‌లో తొలిసారిగా వచ్చే 24 గంటల్లో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద జలాలు చేరే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. అనంతరం నాగార్జునసాగర్‌కు కూడా వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉంది.
మరోవైపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలు ఇంకా లోటు వర్షపాతంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. గోదావరి నదిలో ఆశించిన స్థాయిలో వరదలు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పట్టిసీమ ద్వారా నీటిని తరలిస్తున్నప్పటికీ, కృష్ణా డెల్టా, గోదావరి డెల్టా ప్రాంతాల్లో సాగునీటి సమస్యలు కొనసాగుతున్నాయి. దవళేశ్వరం బ్యారేజీ పరిధిలోని రైతులు కూడా ఖరీఫ్ సాగుకు తగినంత నీరు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రస్తుత వాతావరణ పరిస్థితులను బట్టి, రాబోయే వారం రోజుల పాటు కృష్ణా నదిలో వరద ప్రవాహం కొనసాగేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి