*మహాకవి దాశరథితెలంగాణ ఆత్మగౌరవ కవిత్వంతో ఆధునిక తెలుగు సాహిత్యాన్ని తేజోవంతం చేసిన మహా కవి దాశరథి కృష్ణమాచార్యులు. దాశరథి హృదయం హిమఖండం. దాశరథి కవిత్వం ఒక అగ్నిగుండం.*
ప్రజావిముక్తి ఉద్యమంలో బద్దలైన అగ్నిపర్వతంలా ఆయన కలమెత్తి గళమెత్తి గర్జించాడు. వైతాళిక గీతావళితో భూగోళానికి అగ్గిపెట్టి తిమిరంతో సమరం సాగించాడు. 'పీడిత ప్రజావాణికి మైక్ అమర్చి' కోటి రత్నాలవీణ శ్రుతిలో కావ్యగానం చేశాడు.
'ఏ కంటిలోనూ కన్నీటి చుక్క కనిపించని ఆదర్శ సమాజం రచయిత ధ్యేయం కావాలని' పిలుపునిచ్చిన దాశరథి ఈ సమున్నత ఆశయసాధన కోసం తన సాహిత్యాన్ని అంకితం చేశాడు. పద్యం, గేయం, వచన కవిత, అనువాదం, రుబాయీ లాంటి భిన్న ప్రక్రియల్లో దాశరథి మిన్నగా రాణించాడు. ప్రాంతదర్శి కానివాడు క్రాంతదర్శి కాలేడు అన్నట్టుగా, తన ప్రాంత నైసర్గిక, భౌగోళిక, సాంస్కృతిక వైభవ ప్రాభవాలను కవిత్వంలో దాశరథి రసరమ్యంగా రాశిపోశాడు. వాసిగాంచిన తెలంగాణ ప్రశస్తిని సగర్వంగా చాటిచెప్పాడు.
సంప్రదాయ వైష్ణవ కుటుంబంలో జన్మించిన దాశరథి, సాయుధ విప్లవ పోరాట స్ఫూర్తితో కుల మత పరిమితులను ఛేదించుకొని ప్రగతిశీల పథంలో ముం దుకు సాగిపోయాడు. నిజామాంధ్ర మహాసభ, హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ వంటి సంస్థల సాంగత్యంలో ఆనాటి నైజాం రాజ్యంలో జాగీర్దారుల, జమీందారుల దౌర్జన్యాలను, రజాకారుల రక్తదాహాన్ని ధిక్కరించి సాంస్కృతిక సమరం చేశాడు. నిజాం నియంతృత్వ ధోరణికి, దమననీతికి వ్యతిరేకంగా పన్నెండేండ్ల ప్రాయంలోనే దాశరథి పదునైన పద్యాస్ర్తాలను సంధించాడు. కవి సమ్మేళనం జరుగుతున్న సభా వేదికను శత్రువులు తగలబెట్టినా లెక్కచేయకుండా ఆ నిప్పురవ్వల నడుమ నిలబడి వీరోచితంగా కవితా పఠనం చేసిన ధీరోదాత్తుడు దాశరథి. జాతీయోద్యమం, తెలంగాణ సాయుధ పోరాటాల ఎరుకతో దేశభక్తిని, నిజాం రాష్ట్ర ప్రజల దాస్యవిముక్తిని, శ్రమజీవుల త్యాగాలను దాశరథి అద్భుతంగా కవిత్వీకరించాడు.
రైతు కూలీల కష్టనష్టాలను వేయి కన్నులతో పరిశీలించి వారి కన్నీటిని కలం గుండెల్లోకి వొంపుకొని కావ్యా లు రాశాడు. 'అనాథుడికి ఆగర్భ శ్రీనాథుడికి' అనాదిగా సాగుతున్న అనంత సంగ్రామాన్ని వర్ణించాడు. దేవుళ్లను దయ్యాలను వేడనని, ధనరాజుకు, రారాజుకు ఓడనని, సాహసోపేతంగా దాశరథి ప్రకటించాడు.'ధనవంతుల కనక సౌధాలకివతల వణికే నిరుపేదల అడుసు గుడిసె గోడను' అని లేమికి విధేయంగా చాటింపు వేశాడు. నిరుపేదల స్వేదంలోనే ప్రసాదం ఉన్నదని నిర్ధారించాడు. చింతల తోపులో కురిసే చినుకులకు తడిసి ముద్దయిపోతున్న బాలింత ఒడిలోని పసిబిడ్డ కోసం రుద్రవీణపై వెచ్చని అగ్ని గీతాలను ఆలపించాడు. మట్టి తట్ట నెత్తిన పెట్టుకొని మండుటెండలో ప్రయాస పడుతున్న కూలి తల్లి కోసం అరుణ తరుణాక్షరాల పద్యాలు కూర్చాడు. ఎంగిలి మెతుకులకై ముందుకుసాగే ఆకలి డొక్కలను, చింకి పాతలకై వేచియున్న దిగంబర దేహాలను సమాదరించి తన అక్షరాల నీడలో సేద తీర్చాడు. 'తరతరాల పేదల త్యాగాల పంట ను' దిగమింగిన దగాకోరు రాజకీయాలను నిరసించాడు. ఈ విధమైన సృజన గరిమతో నిజమైన ప్రజాకవిగా దాశరథి ప్రఖ్యాతిగాంచాడు.
ప్రజా పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొనటం వల్ల మిగతా కవుల కంటే దాశరథి ప్రభావశీలమైన సాహిత్యాన్ని సృష్టించాడు. విభిన్న సామాజిక శ్రేణుల ప్రత్యేక సమస్యలపై కూడా దాశరథి చూపు సారించి తదనుగుణంగా రచనలు చేశాడు. 'కులమతాల సుడిగుండాల' వల్ల సంభవించే సామాజిక ప్రమాదాలను గురించి దాశరథి హెచ్చరించాడు. 'నా కుల మె ద్దియో యెరుగ? నా మత మెయ్యదియో యెరుగ?… లేళ్లది, రాళ్లది యే కులంబాకులమే మదీయము' అని సమానత్వ సందేశాన్ని అందించాడు. మిసిసిపీ విశ్వ విద్యాలయంలో తొలి నీగ్రో పట్టభద్రుడు జేమ్స్ మెరిడిత్‌కు 'నీలి రవ్వ' కవితతో దాశరథి నీరాజనాలు పలికాడు. 'నలుపు లోంచి నవ నాగరికత ఉద్భవిస్తున్నది/ నలుపులోంచి వెలుతురు వికసిస్తుందని' అణగారిన వర్గాల్లో విశ్వవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న ప్రతిఘటనాత్మక చైతన్యాన్ని అక్షరబద్ధం చేశాడు.
'జ్ఞాన నయనమ్ములవాడు, 'మనస్సులోపలన్ తెల్లని వాడు', హింసను వధించిన వాడు, శాంతిపై జల్లినవాడు, తెల్లని విషమ్మునకు విరుగైనవాడు' నీలిరవ్వ అని నల్ల జాతీయుల బహుముఖీన ఘనతను పోతన పద్యశైలిలో దాశరథి తేటతెల్లం చేశాడు. వర్ణాంతర వివాహాలు ఎంత ఎక్కువగా జరిగితే అంత కులతత్వం నశిస్తుందని, మతాంతర వివాహాలు కూడా విస్తృతంగా జరగాలని వనితా జ్యోతి పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దాశరథి పేర్కొన్నాడు. స్త్రీలను గౌరవించని జాతి అభివృద్ధి చెందదని ఆయన స్పష్టం చేశాడు. మహాబోధి, మహా పరినిర్వాణం అనే రెండు నాటికల్లో దాశరథి బుద్ధుని సమతాధర్మాన్ని, కారు ణ్య తత్త్వాన్ని ప్రబోధించాడు. 'మానవకోటి బుద్ధమూర్తిని మరిచి పోదగునే' అని కీలకంగా ప్రశ్నించాడు.
అనవద్యమైన కళాతత్త్వంతో దాశరథి తెలు గు పద్యాన్ని కదం తొక్కించాడు. ఫ్యూడల్ వ్యవస్థకు ప్రతీకగా వచన పండితుల నీలాప నిందలను ఎదుర్కొన్న పద్యాన్ని, తన పెన్ను బలంతో దాశరథి ప్రజాస్వామ్య భావజాల ప్రచారానికి వాహికగా మార్చాడు. 'గుండె దడ లో గణాలను గుణించుకొని రాయాలని, సృజనకారులకు హితవు చెప్పిన ఆయన ప్రతి పద్యా న్ని ఇలాంటి శైలితో తీర్చిదిద్దాడు. వచన కవిత్వంలో శ్రీశ్రీ పలికించిన ఒడుపును మాత్రాఛందో ఫణితిని దాశరథి పద్య కవిత్వంలో ప్రతిభావంతంగా పలికించాడు. వచన కవిత్వంలో ఎక్కువగా కనబడే సౌందర్యశోభితమైన వ్యక్తీకరణలతో తెలుగు పద్యానికి కొత్త సొబగులద్దాడు.
'గెలిచినది గడ్డిపోచ, ముక్కలయి పోయి/ మన్ను కరిచెను గొడ్డలి, కన్నులోని/ వేడి అశ్రువు గెలిచెను వాడి కత్తి ఓడిపోయెను' అం టూ ప్రతీకాత్మకంగా అత్యాధునిక అభివ్యక్తితో ప్రజాపోరాట విజయా న్ని దాశరథి అద్భుతంగా కవిత్వీకరించాడు. రెండు వందల ఏండ్ల చరిత్రపుటలు కప్పుకొని యున్న గాఢాంధకారం, తూరుపు మిట్ట నుంచి, పారి వచ్చిన వెలుతురు వాగులో కొట్టుకొని పోయిందని స్వేచ్ఛా భారతాన్ని కమనీయంగా కీర్తించాడు. ఉర్దూ భాషా పరిమళాలతో దాశరథితన కర్తృత్వానికి పుటం పెట్టుకున్నాడు. 'తమోవృక్షం', 'అశ్రు దీపికలు', 'రుధిర పక్షులు', 'విప్లవ మేఘం', 'వెలుతురుబాకు' లాంటి రూపకాలు ఆయన పద్యనిర్మాణ శిల్పంలో అపురూపంగా ఒదిగిపోయాయి. 'పజ్జొన్నకూడు' లాంటి నిసర్గ సుందరమైన తెలంగాణ పలుకుబడిని తన పద్య పల్లకిలో దాశరథి ఊరేగించాడు.
సమకాలీన కవుల విశిష్టతను, వారి ప్రత్యేక స్థానాన్ని దాశరథి నిజాయితీగా అంచనావేశాడు. 'జాషువా గారితో ఇరువైయవ శతాబ్దంలోని తెలుగు సాహిత్యం ఒక కొత్త మలుపు తిరిగింది' (మహాకవి జాషువా వ్యక్తిత్వం కవిత్వం -డాక్టర్ ఆర్.ఆర్.సుందర రావు పరిశోధన గ్రంథం ముందుమాట) అని సాటికవి ఔన్నత్యాన్ని సత్యసమ్మతంగా అభివర్ణించే ఉదాత్త సంస్కారం దాశరథికి తప్ప మరెవరికుంటుంది. మఖ్దూమ్ మొహియుద్దీన్, కాళోజీ, వట్టికోట, సి.నారాయణరెడ్డి తదితర కవుల గొప్పతనాన్ని కూడా దాశరథి సమున్నతంగా విశ్లేషించాడు.
'తెలగాణ భవదీయ పుత్రకులలో తీండ్రించు వైప్లవ్య సంచలనమ్మూరక పోవలేదని' స్వరాష్ట్ర స్వప్నం సాకరమవుతుందని నాడే దాశరథి ఊహించాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఫలాలను ఆస్వాదిస్తున్న శుభ తరుణంలో ఈ తెలంగాణ సోయికి మూలమైన దాశరథి కవిత్వం అజరామరం.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి