సుప్రీంకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు సంబంధించిన ఎన్నికల తదుపరి ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అభ్యర్థుల తుది జాబితా ప్రచురణను అక్టోబర్ 25 వరకు వాయిదా వేయాలని నిర్ణయించింది. నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డంకులు ఎదుర్కొన్న అభ్యర్థుల ఫిర్యాదులు, వాటికి సంబంధించిన ఆధారాలను పరిశీలించి, నామినేషన్ల గడువు పొడిగించాలా వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.
ఈ అంశంపై అక్టోబర్ 22న నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి సూచించింది. నామినేషన్ల గడువును పొడిగిస్తే, నిర్ణయం ప్రకటించిన సమయం నుంచి కనీసం 48 గంటల గడువు ఇవ్వాల్సి ఉంటుంది.
జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, పోలీసు ఉన్నతాధికారుల నుంచి నివేదికలు తీసుకున్న అనంతరం తదుపరి చర్యలపై రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోనుంది.
ముఖ్య గమనిక: ఎన్నికలు పూర్తిగా రద్దు కాలేదు. ఎన్నికల ప్రక్రియపై తదుపరి నిర్ణయం రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసే ఉత్తర్వులపై ఆధారపడి ఉంటుంది.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి