రేపు మధ్యాహ్నం 3.30 గంటలకు తదుపరి విచారణ
అమరావతి, అక్టోబర్ 5: విశాఖపట్నంలో ప్రతిపాదిత అదానీ డేటా సెంటర్ ప్రాజెక్టుకు సంబంధించిన పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం తదుపరి విచారణను మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు వాయిదా వేసింది.
విశాఖలో అదానీ ఇన్‌ఫ్రా ప్రతిపాదించిన భారీ డేటా సెంటర్ ప్రాజెక్టు కోసం సింహాచలం దేవస్థానం భూములను లీజుకు ఇవ్వడాన్ని, ప్రాజెక్టుకు మంజూరైన పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు.
పిటిషనర్ తరఫున న్యాయవాది విరాగ్ గుప్తా వాదనలు వినిపిస్తూ.. ప్రతిపాదిత ప్రాజెక్టు ప్రాంతం వన్యప్రాణి అభయారణ్యం/రిజర్వ్ ఫారెస్ట్‌కు కేవలం 470 నుంచి 750 మీటర్ల దూరంలోనే ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నిబంధనల ప్రకారం అభయారణ్యానికి ఒక కిలోమీటర్ పరిధిలో నిర్మాణాలకు అనుమతి ఉండదని, ఐదు కిలోమీటర్ల పరిధిలోని ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ పర్యావరణ అనుమతులు తప్పనిసరి అని పేర్కొన్నారు.
అయితే రాష్ట్ర ప్రభుత్వం 2026 ఫిబ్రవరి 27న జారీ చేసిన G.O. No.4 ద్వారా నిబంధనలను సడలించి, సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇచ్చిందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. భారీ స్థాయి డేటా సెంటర్ ప్రాజెక్టును సాధారణ ‘బిల్డింగ్ ప్రాజెక్టు’గా చూపించి అనుమతులు పొందారని ఆరోపించారు.
ఈ ప్రాజెక్టు విశాఖ నగర తాగునీటి రిజర్వాయర్లు, క్యాచ్‌మెంట్ ప్రాంతాలు, భూగర్భ జల వనరులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా సరైన రిజిస్టర్డ్ లీజ్ డీడ్ లేకుండానే సబ్-లీజ్ ద్వారా భూమిని అప్పగించడంపైనా ప్రశ్నలు లేవనెత్తారు.
ప్రభుత్వం తరఫున వాదనలు
ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదిస్తూ.. ప్రాజెక్టుకు సంబంధించిన పర్యావరణ అనుమతులు 2026 జూన్ 10 నాటికే మంజూరయ్యాయని తెలిపారు. అన్ని అంశాలను పరిశీలించిన అనంతరం G.O. No.4 ద్వారా అవసరమైన సడలింపులు ఇచ్చినట్లు కోర్టుకు వివరించారు.
ఇదే అంశంపై మరో వ్యక్తి జాతీయ హరిత ట్రైబ్యునల్ (NGT)లో పిటిషన్ దాఖలు చేశారని, ఆ కేసు ఎల్లుండి విచారణకు రానుందని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు.
ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. పిటిషనర్ దాఖలు చేసిన రిజాయిండర్, ప్రభుత్వ ఉత్తర్వులు, ఇతర సంబంధిత రికార్డులను పరిశీలించాల్సి ఉందని పేర్కొంది. దీంతో కేసు విచారణను మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు వాయిదా వేసింది.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి