కాళంగి నదిపై హైలెవల్ బ్రిడ్జికి అనుమతులు, నిధులు మంజూరు చేయాలి
సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం
సూళ్లూరుపేట నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును సూళ్లూరుపేట ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం మంగళవారం కలిశారు.
ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసి నియోజకవర్గంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా సూళ్లూరుపేట పట్టణంలోని కాళంగి నదిపై నాలుగు లైన్ల హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి త్వరితగతిన అనుమతులు మంజూరు చేసి, అవసరమైన నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రిని ఎమ్మెల్యే విజయశ్రీ కోరారు.
అదేవిధంగా సూళ్లూరుపేట నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి అవసరమైన పలు ముఖ్యమైన పనులు, ప్రజల అవసరాలను సీఎం దృష్టికి తీసుకెళ్లి, ఆయా అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన అంశాలను ముఖ్యమంత్రి సానుకూలంగా పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకుంటారని ఎమ్మెల్యే విజయశ్రీ ఆశాభావం వ్యక్తం చేశారు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి