మల్లెల న్యూస్ తిరుపతి
తిరుమలలో భద్రతా వైఫల్యంపై సోషల్ మీడియా ప్రచారం అవాస్తవం : టీటీడీ
తిరుమలలో భక్తుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ పటిష్టమైన మూడంచెల భద్రతా వ్యవస్థను నిరంతరాయంగా అమలు చేస్తోందని టీటీడీ స్పష్టం చేసింది. ప్రతి షిఫ్టులో వందలాది మంది భద్రతా సిబ్బంది చెకింగ్, స్కానింగ్ విధుల్లో అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపింది.
ఏదైనా కారణాల వల్ల ఒక భద్రతా అంచె వద్ద గుర్తించబడని మొబైల్ ఫోన్ వంటి నిషేధిత వస్తువులు తదుపరి అంచెలలో గుర్తించి, నిర్దేశిత డిపాజిట్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొంది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిని గుర్తించి, వారిపై అవసరమైన శాఖాపరమైన చర్యలు కూడా తీసుకుంటున్నట్లు వెల్లడించింది.
ఈ నేపథ్యంలో తిరుమలలో భద్రతా వైఫల్యం చోటుచేసుకుందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని టీటీడీ స్పష్టం చేసింది.
సోమవారం సోషల్ మీడియాలో ఒక భక్తుడు సెల్‌ఫోన్‌తో లోకి ప్రవేశించి, అక్కడి కంపార్ట్‌మెంట్ల దృశ్యాలను చిత్రీకరించి పోస్ట్ చేసినట్లు టీటీడీ దృష్టికి వచ్చినట్లు తెలిపింది. అయితే, వాస్తవానికి సదరు భక్తుడు ఆదివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌కు మొబైల్ ఫోన్‌తో వచ్చినప్పటికీ, వివిధ దశల్లో నిర్వహించిన భద్రతా తనిఖీల్లో భాగంగా డౌన్ స్కానింగ్ పాయింట్ వద్ద అతడిని గుర్తించి, భద్రతా సిబ్బంది మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.
ఈ ఘటన తిరుమలలో అమలవుతున్న మూడంచెల భద్రతా వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తోందనడానికి నిదర్శనమని టీటీడీ పేర్కొంది.
అందువల్ల తిరుమలలో భద్రతా వైఫల్యం జరిగిందంటూ నిరాధార ప్రచారం చేయడం, వాస్తవాలకు విరుద్ధంగా సోషల్ మీడియాలో పోస్టులు చేయడం సరికాదని తెలిపింది. భక్తులు అసత్య ప్రచారాలను నమ్మకుండా, అధికారిక సమాచారం పైనే విశ్వాసం ఉంచాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
– సీపీఆర్వో, టీటీడీ
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి