న్యూఢిల్లీ, జూన్ 10: మల్లెల న్యూస్ఎ న్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మీడియాతో అనౌపచారికంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని అమిత్ షా స్పష్టం చేశారు. దక్షిణాది రాష్ట్రాల విషయంలో బీజేపీకి స్పష్టమైన వ్యూహం ఉందని, భవిష్యత్తులో ఏ ప్రాంతీయ పార్టీతోనూ పొత్తులు పెట్టుకునే ఆలోచన లేదని పేర్కొన్నారు. దీంతో తెలంగాణలో బీజేపీ, టీడీపీ లేదా జనసేనతో కలిసి పోటీ చేసే అవకాశాలపై వస్తున్న ఊహాగానాలకు తెరపడినట్టైంది.
ఇటీవల కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్, బీజేపీ మధ్య లోపాయికారీ అవగాహన ఉందంటూ చేస్తున్న ప్రచారాన్ని కూడా ఆయన ఖండించారు. తెలంగాణలో బీజేపీ సొంత బలంతో అధికారంలోకి రావడమే లక్ష్యమని తెలిపారు.
ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదు
నియోజకవర్గాల పునర్విభజన అంశంపై స్పందించిన అమిత్ షా, ఈ ప్రక్రియ వల్ల ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న లోక్‌సభ స్థానాల నిష్పత్తి ఆధారంగా అన్ని రాష్ట్రాల్లో సుమారు 50 శాతం సీట్లు పెరిగేలా చర్యలు తీసుకునే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు.
వన్ నేషన్ – వన్ ఎలక్షన్‌పై అధ్యయనం
దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే “వన్ నేషన్ – వన్ ఎలక్షన్” ప్రతిపాదనపై ఏర్పాటు చేసిన కమిటీ అధ్యయనం కొనసాగుతోందని తెలిపారు. కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఎన్డీయే భాగస్వామ్య పార్టీలకు ఇబ్బందులు లేవు
ఎన్డీయే కూటమిలో భాగస్వామ్య పార్టీలతో సంబంధాలు బలంగా ఉన్నాయని అమిత్ షా చెప్పారు. కూటమిలోని అన్ని పార్టీలు తమ తమ రాష్ట్రాల్లో బలోపేతంగా ఉన్నాయని పేర్కొన్నారు.
అలాగే మీనాక్షీ నటరాజన్ నామినేషన్ తిరస్కరణ విషయంలో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. నామినేషన్ పత్రాల నింపడంలో జరిగిన లోపాల కారణంగానే ఆ పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి