ఆ మూడు గంటలు పార్కులోనే విశ్రాంతి
రాజమహేంద్రవరంలో ఇటీవల మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ కుమార్ విజయవాడలో మూడు గంటల పాటు ఎక్కడ ఉన్నారన్న మిస్టరీ వీడింది. హైదరాబాద్ నుంచి బుల్లెట్ బైక్‌పై బయలుదేరిన పాస్టర్ ఈనెల 24న విజయవాడ మీదుగా రాజమహేంద్రవరం చేరుకున్నారు.
ప్రవీణ్ అలసిపోయి తన ద్విచక్ర వాహనాన్ని రామవరప్పాడు రింగ్‌కు 50 మీటర్లు ముందుగా జాతీయ రహదారిపై ఆపి పక్కన కూర్చున్నట్లు పోలీసులు గుర్తించారు. నగరంలోకి సాయంత్రం 5 గంటలకే చేరుకున్న ఆయన రాత్రి 8.45 గంటలకు ఎనికేపాడు దాటినట్లు సీసీ కెమెరాల్లో నమోదైంది. ఆ మూడు గంటల పాటు ప్రవీణ్ ఎక్కడికి వెళ్లారనేది పసిగట్టడం పోలీసులకు సవాలుగా మారింది. మహానాడు జంక్షన్ నుంచి ఎనికేపాడు వరకు సుమారు 200 కెమెరాలను పోలీసులు గత రెండు రోజులుగా జల్లెడ పట్టారు. విజయవాడలోకి ప్రవేశించే ముందే.. గొల్లపూడి వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల్లో బుల్లెట్ బైక్ పాక్షికంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు.
సాయంత్రం 4.45 గంటలకు విజయవాడ శివారు గొల్లపూడిలో పెట్రోల్ బంకుకు ఆయన చేరుకున్నారు. అక్కడ పెట్రోల్ పోయించుకొని ఫోన్‌పే ద్వారా నగదు బదిలీ చేశారు. అక్కడి నుంచి బయలుదేరి కనకదుర్గ పై వంతెన, వారధి మీదుగా బెంజ్ సర్కిల్ చేరుకున్నారు. 5.20 గంటలకు రామవరప్పాడు రింగ్‌కు కొద్ది దూరంలో బైక్ ఆపి కూర్చున్నారు. ఇది గమనించి అక్కడికి వచ్చిన ట్రాఫిక్ ఎస్‌ఐ సుబ్బారావు అతనికి తాగునీరు ఇచ్చి పక్కనున్న పార్కులో కూర్చోబెట్టారు. తాను హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వెళుతున్నానని ప్రవీణ్ ఎస్‌ఐకి చెప్పారు. బైక్ హెడ్‌లైట్ దెబ్బతిని ఉండడంతో అప్పటికే బైక్ ఎక్కడో ప్రమాదానికి గురైనట్లు పోలీసులు గుర్తించారు. హెల్మెట్ ఉండడం వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని గమనించారు. ప్రవీణ్ ఫొటో తీసుకున్నారు. పాస్టర్ సాయంత్రం 5.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు అక్కడి పార్కులో విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం ఎస్‌ఐ టీ తెప్పించి ఇచ్చారు. తర్వాత తన ద్విచక్ర వాహనంపై ఆయన రామవరప్పాడు రింగ్ మీదుగా వెళ్లిపోయారు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి